కోరలు సాచిన పేదరికం... ప్రేమ పేరుతో చేసే మోసం.. ఆకర్షణల వల విసిరి చేసే మాయాజాలం.. వంటివి ఎందరో ఆడపిల్లల్ని గాడితప్పేలా చేస్తున్నాయి. అక్రమ రవాణాకు బలి చేస్తున్నాయి. అభిమానం చంపుకొని చేసే వృత్తిలోకి నెట్టి వేస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో అక్రమ రవాణాపై లాఠీ విసిరి.. అలసిన హృదయాలను చదువు, ఉపాధి బాటలో నడిపిస్తున్నారు రాజమండ్రి డీఎస్‌పీ జానకీ షర్మిల. ఆ విషవలయంలో పడకుండా.. ఉండేందుకు.. దుర్భర పరిస్థితుల నుంచి బయటపడేందుకు వివేకం, ధైర్యం, ఆశావహ దృక్పథం అవసరం అంటున్నారు. వూహ తెలిసీ తెలియని వయసులో ఎన్నో ఆశలు. ఆలోచనలు. ప్రపంచమంతా స్వచ్ఛమైనదన్న అమాయకత్వం. ఈ పరిస్థితుల్లో చుట్టూ ఉన్న రంగుల ప్రపంచం అద్భుతంగా తోస్తుంది. సౌకర్యాలు, విలాసాలు కళ్లు మిరుమిట్లు గొలుపుతాయి. ఇక మాటలతో మంత్రం వేసే మాయగాళ్ల సంగతి చెప్పేదేముంది. ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్నా.. పరిస్థితుల్ని, వ్యక్తుల్ని అంచనా వేయడంలో పొరబాటు చేసినా... రెక్కలు విప్పుకొనే జీవితం... పంజరంలో చిక్కుకుపోతుంది. అభిమానం చంపుకొని చేసే వృత్తి దిశగా పతనం అవుతుంది. ఉత్తర భారతానికి, ఇతర దేశాలకు ఇక్కడి నుంచి అమ్మాయిలు తరలించబడుతున్నారంటే వారి తెలియనితనం కొంత. పరిస్థితుల ప్రభావం.. వారి సంరక్షణకు కట్టుదిట్టంగా కార్యాచరణ చేపట్టకపోవడం మరికొంత. తెలిసీ తెలియక సమస్యల్లో... అమాయకత్వం, అసహాయత వంటి కారణాలతో పాటూ అయిన వాళ్లు, సమస్తం అనుకున్న వాళ్లే అమ్మాయిలను మోసం చేసి పక్కదారి పట్టించే సందర్భాలు అధికం అన్నారు జానకి. 'కొవ్వూరులో మొదట బాధ్యతలు చేపట్టాను. ఆ ప్రాంతంలో అమ్మాయిల అక్రమ రవాణా అధికం. ఆ కేసులు నన్ను చూడమన్నారు. లోతైన అధ్యయనం కోసం ముంబయి వెళ్లాను. వందల మందిని మురికి కూపం నుంచి రక్షించగలిగాను. ఆ తరవాత తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలతో పాటూ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లోని పరిస్థితిని తెలుసుకున్నాను. అమ్మాయిలు ఈ మురికి కూపంలోకి చేరుకునే పరిస్థితులు గమనించి ఆశ్చర్యపోయాను. ఆకర్షణను ప్రేమనుకొంటూ ఓ వ్యక్తితో ఇల్లు వదిలి రావడం. ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ బాధ్యతలు భరించలేక నమ్మిన వ్యక్తే వదిలేయడం, అమ్మేయడం. ఇలా ఇంటికి తిరిగిరాలేక స్వార్థపరుల చేతుల్లో చిక్కిన వారున్నారు' అంటూ చేదు జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. విముక్తి కల్పించి ఉపాధి... అభం శుభం తెలియని చిన్నారులకు బాల్య వివాహాలు చేయడం.. అబ్బాయి గురించి పూర్తిగా విచారించకుండానే సంబంధాలు కుదర్చడం..అలంకరణలు, ఆధునిక వస్తువులు, సినిమాల మోజులో పడే వారికి సరైన సమయంలో దిశానిర్దేశం లభించకపోవడం కూడా మాయగాళ్ల చేతికి అమ్మాయిలు చిక్కే పరిస్థితుల్ని కల్పిస్తున్నాయి. 'రెండేళ్ల క్రితం ఖమ్మంలో ఉన్నప్పుడు జరిగిన సంఘటన నన్ను తీవ్రంగా కదిలించింది. సుమ అనే అమ్మాయి వ్యభిచారం కేసులో పట్టుబడింది. తనకి నిండా పదహారేళ్లులేవు. అనునయించి ఆరాతీస్తే ఏడుస్తూ విషయం చెప్పింది. తనను స్వయంగా భర్తే ఈ రొంపిలోకి దింపాడంది. తల్లీతండ్రీలేని ఆమెను ప్రేమంటూ నమ్మించి పెళ్లి చేసుకున్నాడు. బాల్య వివాహం, భర్తచేసిన ఘోరం.. అందులో ఆ పిల్ల తప్పేం లేదనిపించింది. అందుకే ఆ అమ్మాయికి ఓ ఆసరా కల్పించి హోటల్ మేనేజ్‌మెంట్‌లో శిక్షణ ఇప్పించాం. ఏడాది తిరిగేసరికి తను చక్కగా చదువులో రాణించి, ఉద్యోగంలో కుదురుకొంది. పాత జీవితాన్ని క్రమంగా మర్చిపోయింది' అంటూ వివరించారు జానకి. బాధల బందీఖానా నుంచి బయటకు తీసుకొచ్చి ఉపాధి రూపంలో వారికి ఒక ఆసరా కల్పిస్తే పరిస్థితులని చక్కదిద్దుకొంటారని గ్రహించిన ఆమె ఆ తరవాత పదుల సంఖ్యలో బాధిత హృదయాలకు బతుకుపై ఆశ కల్పించారు. నర్సరీ ఏర్పాటు, డేటా ఎంట్రీ, నర్సింగ్‌లో శిక్షణ వంటి వాటిల్లో ఆదాయవనరు చూసుకొనేలా ప్రోత్సహించారు. సవాళ్లకు దీటుగా స్త్థెర్యం.. సమాజం పోకడలను అర్థం చేయించి.. చెడు దృష్టి పడకుండా బంగారు తల్లులను కాపాడుకోవడం తల్లిదండ్రుల కర్తవ్యం. అతివల బేలతనం, బలహీన క్షణాలని సొమ్ము చేసుకోవాలనే స్వార్థపరుల ఆటకట్టించడం సామాజిక బాధ్యత కూడా. 'అమ్మాయిల్లో దృఢమైన మనస్తత్వం.. ప్రశ్నించే తత్వాన్ని చిన్నప్పట్నుంచి ప్రోది చేయాలి. ముళ్లబాటలో నడిచి, కష్టాలు కడలిని దాటి పైకి వచ్చిన ప్రముఖ వ్యక్తులను పరిచయంచేసి... చదువుతో ఎదగమని ప్రోత్సహించాలి. చిన్న వయసులో ప్రేమ, పెళ్లిళ్లకంటే చదువుకున్న ప్రాధాన్యం తెలియజేయాలి. ఆటపాటలు, ఆత్మరక్షణ విద్యలతో అగ్గిబరాటాల్లా తీర్చిదిద్దాలి. ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పుడు తోడునిలిచి నడిపించే స్వచ్ఛంద సంస్థలు, హెల్ప్‌లైన్లు ఉన్నాయి. వయసు, స్థాయిని బట్టి వాటినీ పరిచయం చేయాలి. ముఖ్యంగా ఇంట్లో దొరకని ఆప్యాయతలను పరాయి వ్యక్తులనుంచి పొందాలని పిల్లలు ప్రయత్నిస్తారన్న వాస్తవాన్ని పెద్దలు గుర్తెరిగితే కొన్ని సమస్యలు తలెత్తవు' అంటూ తన అనుభవాల నుంచి సూచనలు చేశారు జానకి. ఒకవేళ మోసపోతే చీకట్లను తిట్టుకొంటూ కూర్చోకుండా ఆత్మస్త్థెర్యంతో, అండగా నిలిచే చట్టాలతో బయటపడాలి.. కొత్త జీవితాన్ని సానుకూల దృక్పథంతో ఆరంభించాలి అంటూ సూచించారు. ఈ రకమైన చెడు పోకడలను ప్రోత్సహించే, అమలుచేసే వారి సమాచారాన్ని అందివ్వడం, ఆటకట్టించడంలో ప్రతి ఒక్కరూ చొరవ చూపాలన్నారు.
- సూర్యకుమారి, న్యూస్‌టుడే, రాజమండ్రి |
Everything about Chilakaluripet చిలకలూరిపేట
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి